Dinakaran: తిరువారూర్ ఉప ఎన్నికకు అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే, దినకరన్ పార్టీ
- డీఎంకే నుంచి కళైవనన్
- ఏఎంఎంకే నుంచి కామరాజ్ పోటీ
- నేడు తమ అభ్యర్థిని ప్రకటించనున్న అన్నాడీఎంకే
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువారూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 28న ఉప ఎన్నిక జరగనుంది. పదో తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా, 31న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తిరువారూర్ స్థానం నుంచి పోటీ పడే అభ్యర్థులను ప్రతిపక్ష డీఎంకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) అభ్యర్థులను ప్రకటించాయి.
డీఎంకే నుంచి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పూండి కళైవనన్ బరిలోకి దిగుతుండగా, ఏఎంఎంకే నుంచి ఎస్.కామరాజ్ పోటీ పడనున్నారు. శుక్రవారం ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తనను గెలిపించినట్టుగానే కామరాజ్ గెలుపునకు కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు దినకరన్ పిలుపునిచ్చారు.
ఇక అధికార అన్నాడీఎంకే పార్టీ నేడు తమ అభ్యర్థిని ప్రకటించనుంది. తిరువారూర్ స్థానానికి ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయగానే డీఎంకే ప్రిన్సిపల్ సెక్రటరీ టీఆర్ బాలు, పార్టీ లెజిస్లేటివ్ అసెంబ్లీ విప్ ఆర్.చక్రపాణి అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిశారు. తండ్రి స్థానం నుంచి బరిలోకి దిగాలని ఆయనను కోరారు. ప్రస్తుతం కొలత్తూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న స్టాలిన్ వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. పార్టీ అభ్యర్థిగా పూండి కళైవనన్‌ను ప్రకటించారు.