Telangana: తెలంగాణలో చేరతామంటున్న 40 మహారాష్ట్ర గ్రామాలు.. స్పందించిన కేటీఆర్!
- ఇంతకంటే గొప్ప ప్రశంస ఉండదని వ్యాఖ్య
- బాజిరెడ్డి గోవర్దన్ ని కలిసిన మరాఠాలు
- ట్విట్టర్ లో స్పందించిన టీఆర్ఎస్ నేత
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని ఇటీవల ఓ ప్రతిపాదన తెచ్చిన సంగతి తెలిసిందే. తమ గ్రామాలతో పోల్చుకుంటే తెలంగాణలోని సరిహద్దు గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని ఈ సందర్భంగా ఓ సర్పంచ్ వెల్లడించారు. మహారాష్ట్ర ప్రభుత్వం గత 70 ఏళ్లలో తమ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదని వాపోయారు. తాజాగా ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ఏ ప్రభుత్వానికి అయినా ఇంతకంటే గొప్ప ప్రశంస ఉంటుందా? మహారాష్ట్ర సరిహద్దులోని 40 గ్రామాలు తెలంగాణలో విలీనం కావాలని కోరుకుంటున్నాయి’ అని ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ నేత బాజీరెడ్డి గోవర్ధన్ ని ఇటీవల కలుసుకున్న ఓ గ్రామ సర్పంచ్ బాబూరావ్ కదమ్, తనతో పాటు 40 మహారాష్ట్ర గ్రామాల సర్పంచ్ లు తెలంగాణలో విలీనం అయ్యేందుకు సిద్ధమని ఓ ప్రతిపాదనను అందజేశారు.