Andhra Pradesh: జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ అధికారులకు షాక్.. సహకరించని ఏపీ పోలీసులు!
- ప్రభుత్వ అనుమతి లేకుండా ఇవ్వలేమని స్పష్టీకరణ
- ఎన్ఐఏ విచారణకు హైకోర్టు ఆదేశం
- ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసు విచారణను హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఈరోజు హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసు విచారణను చేపట్టేందుకు ఈరోజు ఉదయం విశాఖపట్నంకు చేరుకున్నారు. కేసు వివరాలను తమకు అప్పగించాలని కోరారు. అయితే ఇందుకు విశాఖ పోలీసులు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.
జగన్ పై గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమనీ, కేంద్రం చర్య ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు ముఖ్యనేతలతో వ్యాఖ్యానించినట్లు నిన్న వార్తలు వచ్చాయి.