Kerala: ఆగని ఆందోళనలు...ఇంకా అట్టుడుకుతున్న కేరళ!
- శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసన జ్వాలలు
- కొనసాగుతున్న హిందూ సంస్థల ఆందోళన
- ఇప్పటి వరకు 1800 మంది అరెస్టు
కేరళ ఇంకా అట్టుడుకుతోంది. ఆందోళనలు శనివారం కూడా తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనతో రాష్ట్రం రణరంగంగా కనిపిస్తోంది. పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కన్నూర్ జిల్లా ఇరిత్తి ప్రాంతంలో సీపీఎంకు చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు ఆందోళన కారులు దాడిచేసి అతన్ని కత్తితో గాయపరిచారు. ఎమ్మెల్యే ఎ.ఎన్.షంషీర్ ఇంటిపై కూడా దాడి జరిగింది.
తస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి.మురళీధరన్ నివాసంపై ఆందోళనకారులు బాంబులు విసిరారు. ఆ సమయానికి ఎంపీ కుటుంబ సభ్యులు ఇంట్లోనే నిద్రిస్తున్నప్పటికీ ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తెల్లవారు జామున కన్నూరులోని ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నిప్పుపెట్టారు. కోజికోడ్ జిల్లాలో సీపీఎం, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం వరకు ఆందోళనలు ఏ మాత్రం సద్దుమణగలేదు. గురువారం నుంచి ప్రారంభమైన ఆందోళనలు తగ్గకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇప్పటి వరకు పోలీసులు 1800 మందిని అరెస్టు చేశారు. కాగా, ఆందోళనల కారణంగా 6వ తేదీన రాష్ట్రంలోని పథనందిట్టకు రావాల్సి ఉన్న ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడింది.