Chandrababu: ఆ విషయం కంప్యూటర్లు కనిపెట్టిన చంద్రబాబుకే తెలియాలి!: కేటీఆర్ సెటైర్
- ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదు
- ప్రజాకూటమి ఇంకా ఉంటుందా?
- 16 పార్లమెంట్ స్థానాల్లో మేమే గెలుస్తాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబునాయుడు రావడం వల్లే టీఆర్ఎస్ కు మేలు జరిగిందని, ఆయన రాకవల్లే తాము గెలిచామనడం కేవలం అపోహేనని టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు రాకముందే ప్రజలు తమ పార్టీకి ఓటెయ్యాలని డిసైడ్ అయ్యారని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇంకా తేరుకోలేదని, వారికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజాకూటమి ఇంకా ఉంటుందా? అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరగడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందంటూ వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈ విషయం కంప్యూటర్లు కనిపెట్టిన చంద్రబాబుకే తెలియాలని భారీ సెటైర్ విసిరారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 16 పార్లమెంట్ స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కోదండరామ్ ను ప్రజలు తిరస్కరించారని, ఆయన రాజకీయాల్లో కొనసాగాలా? వద్దా? అన్న నిర్ణయం ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణం, ఓటరు నమోదుపై చురుగ్గా పనిచేస్తున్నామని చెప్పారు. పార్టీ గురించి ఏ నిర్ణయమైనా తమ అధినేత కేసీఆరే నిర్ణయిస్తారని, ఆయన ఆదేశాలను మాత్రమే అమలు చేస్తానని స్పష్టం చేశారు.