Kerala: శబరిమల వివాదం.. ఎనిమిది మంది మహిళలు దర్శనం చేసుకున్నారన్న పోలీసులు!
- వెల్లడించిన కేరళ పోలీసులు
- భక్తులు, మీడియా దృష్టిలో స్వామిని దర్శించుకుంది ముగ్గురే
- ఎక్కువ మందిని ఆలయానికి రప్పించేందుకు ప్రభుత్వం కుట్ర
- స్పందించిన శబరిమల కర్మ సమితి
శబరిమల ఆలయంలోకి ఏ వయసు వారైనా వెళ్లవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత, ఇప్పటివరకూ 10 నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న 8 మంది మహిళలు స్వామిని దర్శించుకున్నారని కేరళ పోలీసులు తెలిపారు. భక్తులు, మీడియా దృష్టిలో ఇప్పటివరకూ రుతుక్రమ వయసులో ఉన్న ముగ్గురు మాత్రమే స్వామిని దర్శించుకున్నారు. గడచిన బుధవారం నాడు బిందు అమ్మణ్ణి, కనకదుర్గ అనే మహిళలు, ఆపై శ్రీలంక నుంచి వచ్చిన 46 ఏళ్ల మహిళ మాత్రం స్వామిని దర్శించుకోగా, పోలీసులు మాత్రం 8 మంది స్వామిని దర్శించుకున్నారని చెప్పడం గమనార్హం.
ఇక దీనిపై శబరిమల కర్మ సమితి స్పందిస్తూ, పోలీసుల వాదనను తిరస్కరించింది. మరింత మంది మహిళలను ఆలయానికి రప్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం కావాలనే ఇటువంటి ప్రకటనలను చేస్తోందని ఆరోపించింది. శ్రీలంకకు చెందిన మహిళ శశికళ, ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నం ఓ ప్రహసనమని పేర్కొంది. కాగా, బిందు, కనకదుర్గలు స్వామిని చూసిన తరువాత, గర్భగుడిని మూసివేసి, సంప్రోక్షణ చేయడంపై ప్రధాన పూజారి రాజీవరును వివరణ కోరుతూ ట్రావెన్ కోర్ దేవస్థానం నోటీసులు జారీ చేసింది.