Janagama: లాటరీ తగిలిందన్న మెసేజ్ చూసి.. రూ. 71 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!

  • జనగామ జిల్లాలో ఘటన
  • అప్పులు తెచ్చి కేటుగాళ్లకు అప్పగింత
  • ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న భరత్ అనే యువకుడు

లాటరీ తగిలిందంటూ వచ్చే మెసేజ్ లను నమ్మద్దంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నా, కొందరు ఆ మోసగాళ్ల వలలో పడుతూనే వున్నారు. తాజాగా అలాంటి ఘటనే జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగింది. "కంగ్రాచ్యులేషన్స్... మీకు కోకాకోలా లాటరీ తగిలింది. రూ. 6 కోట్లు గెలుచుకున్నారు. ఆదాయపు పన్ను క్లియరెన్స్ కోసం కొంత చెల్లిస్తే ఆ డబ్బు వచ్చేస్తుంది" అని చెబితే, అమాయకంగా నమ్మి రూ. 71 లక్షలు సమర్పించుకున్నాడో వ్యక్తి. అప్పులు తెచ్చి మరీ మోసగాడికి ఆ డబ్బులు ఇచ్చిన కరికె అయిలయ్య కుమారుడు భరత్, అప్పులోళ్ల భయంతో ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు.

 పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కోకాకోలా కంపెనీ క్విజ్ పోటీల్లో రూ. 6 కోట్లు గెలుచుకున్నట్టు అతని మొబైల్ ఫోన్ కు 2018 ప్రారంభంలో ఓ మెసేజ్ వచ్చింది. దీన్ని నమ్మిన భరత్, వారితో మాటలు కలిపాడు. ముందుగా లావాదేవీలు జరుపుతున్నట్టు నమ్మించిన కేటుగాళ్లు, ఐటీ క్లియరెన్స్ పేరు చెప్పి, దఫదఫాలుగా లక్షల్లో డబ్బులు గుంజారు.

ఈ డబ్బుకోసం భరత్ అప్పు మీద అప్పు చేశాడు. రూ. 71 లక్షలు వారు ఇచ్చిన ఖాతాల్లో వేసిన తరువాత, అతనికి విషయం అర్థమైంది. ఆపై అప్పులు ఇచ్చిన వారు నిలదీస్తుండటంతో ఇల్లొదిలిపోయాడు. భరత్ కు లక్షల్లో అప్పిచ్చిన సమీప బంధువు ఒకరు తనకు డబ్బు తిరిగిరాదేమోనన్న బెంగతో మృతి చెందాడు. భరత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News