Indian Scince Congress: 'రావణుడి విమానాశ్రయాలు, భారతంలో స్టెమ్ సెల్ టెక్నాలజీ'...: సైన్స్ కాంగ్రెస్ లో ప్రముఖుల ప్రసంగాలతో అవాక్కు!
- పంజాబ్ లో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
- కౌరవులు జన్మించింది స్టెమ్ సెల్ టెక్నాలజీతోనే
- రావణుడికాలంలో లంకలో విమానాశ్రయాలు
- ఏయూ వైస్ చాన్స్ లర్ నాగేశ్వరరావు
పంజాబ్ లోని ఓ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో వక్తలు మాట్లాడిన మాటలు, సభికులను అవాక్కు చేశాయి. పలువురు ఆస్కార్ అవార్డు విజేతలతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, దేశ నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధుల ముందు ఆంధ్రా యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ జీ నాగేశ్వరరావు ప్రసంగిస్తూ, మహాభారతంలో కౌరవులు స్టెమ్ సెల్ టెక్నాలజీతోనే జన్మించారని వ్యాఖ్యానించి కలకలం రేపారు.
భారత చరిత్రలో ఎంతో సైన్స్ ఉందని చెబుతూ, రామాయణ కాలంలో రావణాసురుడు 24 రకాల విమానాలను వాడారని, అప్పట్లోనే శ్రీలంకలో విమానాశ్రయాలు ఉండేవని అన్నారు. విష్ణుమూర్తి దశావతారాలు, మానవ పరిణామక్రమానికి ఉదాహరణని కూడా ఆయన అన్నారు. ఇక ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభికుల్లో ఎంతో మంది ఔత్సాహిక చిన్నారులు కూడా ఉన్నారు.
ఇక తమిళనాడు నుంచి వచ్చిన శాస్త్రవేత్త కేజే కృష్ణన్ మాట్లాడుతూ, ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ లు అవాస్తవాలు చెప్పారని, గ్రావిటీ వేవ్స్ ను, ఇకపై నరేంద్ర మోదీ వేవ్స్ గా పిలవాలని పిలుపునిచ్చారు. ఫిజిక్స్ లో గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎఫెక్ట్ ను హర్షవర్ధన్ ఎఫెక్ట్ గా పేరుమార్చాలంటూ, సంబంధంలేని వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ఈ తరహా ప్రసంగాలు కొత్తేమీ కాదు. జనవరి 2015లో ఇదే సదస్సు ముంబైలో జరిగినప్పుడు కూడా పేరున్న శాస్త్రవేత్తలు ఇదే విధమైన వ్యాఖ్యలను చేయడం విమర్శలకు దారితీసింది.