NTR: నాటి ఎన్టీఆర్ రికార్డును తిరగరాస్తున్న కేసీఆర్!
- 31 రోజులు మంత్రులు లేకుండా పాలించిన ఎన్టీఆర్
- ఇప్పటికే మంత్రులు లేకుండా కేసీఆర్ 24 రోజుల పాలన
- సంక్రాంతి తరువాతే మంత్రివర్గ విస్తరణ
- ఎన్టీఆర్ రికార్డు తిరగరాయబోతున్న తెలంగాణ సీఎం
తెలుగు రాజకీయాల్లో దివంగత మహానేత, ప్రజల్లో నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయేలా ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ కు ఉన్న స్థానం అందరికీ తెలిసిందే. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రజోపయోగ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని ఆయన చేసిన వాగ్దానం అప్పట్లో దేశవ్యాప్త సంచలనమే. ఆయన దాన్ని అమలు చేసి చూపారు కూడా. ఇక ఎన్టీఆర్ నెలకొల్పిన టీడీపీ ద్వారా వెలుగులోకి వచ్చిన కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎన్టీఆర్ కు తక్కువకాదని నిరూపించుకున్నారు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సృష్టించిన ఓ రికార్డును కేసీఆర్ అధిగమించనున్నారు. 31 రోజుల పాటు మంత్రివర్గం లేకుండా ఎన్టీఆర్ పరిపాలన సాగించగా, నాటి రికార్డును కేసీఆర్ తిరగరాయబోతున్నారు. గత నెల 13న కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఆపై ఇంతవరకూ తన మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకోలేదు. ఎన్టీఆర్ 31 రోజుల రికార్డు, ఈ నెల 12తో ముగియనుంది. సంక్రాంతి సెలవుల తరువాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేయడంతో, నాటి ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ ఖాయం.