Nagari: "ఆరునెలలుగా అడుగుతున్నా రావా?"... తిరుపతి బస్టాండ్ లో యువతిపై మాజీ కమిషనర్ దాడి.. చితక్కొట్టిన ప్రయాణికులు!
- నగరి మునిసిపల్ కమిషనర్ గా పనిచేసిన బాలాజీ యాదవ్
- ఆర్థిక అవకతవకలు చేయగా సస్పెన్షన్
- బస్టాండ్ లో యువతిని వేధిస్తుంటే ప్రశ్నించిన ప్రయాణికులపైనా దాడి
- దేహశుద్ధి చేసి ఈస్ట్ పోలీసులకు అప్పగించిన ప్రయాణికులు
తిరుపతి బస్టాండ్ లో ఓ యువతిని వేధిస్తూ కనిపించిన నగరి మునిసిపల్ మాజీ కమిషనర్ బాలాజీ యాదవ్ కు ప్రయాణికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుపతిలో తన తల్లితో కలిసి నివాసం ఉంటూ పుత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న యువతి, విధులకు వెళ్లేందుకు బస్టాండ్ కు వచ్చింది.
ఆ సమయంలో ఆమెను అడ్డుకున్న బాలాజీ యాదవ్, ఆరు నెలలుగా అడుగుతున్నా, తన కోరిక తీర్చేందుకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు. ఆమె మౌనంగా ఉండటంతో కొట్టాడు. ఈ ఘటనను చూస్తున్న ప్రయాణికులు, అతన్ని ప్రశ్నించగా, వారిపై తిరగబడ్డాడు. దీంతో అందరూ కలిసి అతన్ని కొట్టి తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు. 2015 వరకూ నగరి కమిషనర్ గా ఉన్న బాలాజీ యాదవ్, ఆర్థిక అవకతవకలకు పాల్పడి, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు.