Cock: మొదలైన సంక్రాంతి సందడి ..పౌరుషం చూపేందుకు రెడీ అవుతున్న పందెం కోళ్లు!
- కోడి రక్తం చిందకుండా గోదావరి జిల్లాల్లో జరగని సంక్రాంతి
- పందాలకు సిద్ధమైన 20 వేల కోళ్లు
- రూ. 60 వేల వరకూ ధర పలుకుతున్న కోళ్లు
సంక్రాంతి పేరు చెబితే, వెంటనే గుర్తొచ్చేది కోడి పందాలే. అనుమతి ఉన్నా, లేకున్నా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి రక్తం చిందకుండా పండగ జరగదు. ప్రజా ప్రతినిధులు ఈ మూడు రోజుల పందాలను ఎంత వైభవంగా నిర్వహిస్తే, ప్రజల్లో అంత పరపతి పెరుగుతుందని కూడా నమ్ముతుంటారు. పోలీసులు అడ్డుకుంటున్నా, వారిపై ఒత్తిడి తెచ్చి, పెట్టే కేసులను మమ అనిపించేస్తారు.
ఇక ఈ సంవత్సరం దాదాపు 20 వేలకు పైగా కోళ్లు పందెంబరిలోకి దిగి తమలోని పౌరుషాన్ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఏలూరు, భీమవరం, అనకాపల్లి, పాలకొల్లు, నరసాపురం, కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గత మూడు నెలల నుంచి పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తయిన కోడి ధర, జాతిని, పుట్టిన నక్షత్రాన్ని బట్టి రూ. 20 వేల నుంచి రూ. 60 వేల వరకూ పలుకుతున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 20 రకాలకు పైగా కోళ్లు పందాల కోసం సిద్ధమయ్యాయి. వీటిల్లో కాకి, పర్ల, డేగ, నెమలి, సేతువ, కోల, రసంగి, కాటిజాగ, పచ్చకాకి వంటి రకాలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇవన్నీ పందెం బరిలోకి దిగే సమయానికి ఉండే తిథి, నక్షత్రాన్ని చూసి, ఇవి పుట్టిన సమయం సరిపోతుందని భావిస్తేనే దింపుతారు. ఒక్కో కోడిపై రూ. 5 లక్షల నుంచి కొన్నిసార్లు కోట్లలోనూ పందెం డబ్బు చేతులు మారుతూ ఉంటుంది.
ఒక్కో కోడిని మూడు నెలల పాటు పెంచడానికి రూ. 6 నుంచి 7 వేల వరకూ ఖర్చవుతుందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. నిత్యమూ వీటికి మాంసం, జీడిపప్పు తదితరాలు తినిపిస్తూ, రోజూ వ్యాయామం చేయిస్తూ పెంచుతామని, పందాలు జరగకపోతే, తమ పరిస్థితి ఘోరంగా మారుతుందని అంటున్నారు. ఇక ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ప్రజల సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని, పందాలకు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా ప్రభుత్వమే అనధికారికంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వవచ్చని తెలుస్తోంది.