BJP: ఆదివారం సెలవు తీసుకోకుండా అధికారులతో కూర్చున్న చంద్రబాబునాయుడు!
- కేసుల పేరిట బీజేపీ బెదిరింపులు
- సెలవునాడు పని చేస్తున్న అధికారులపై ప్రశంసలు
- సంక్రాంతి సందర్భంగా అదనపు సెలవు ఇస్తామని వెల్లడి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పని చేయాలని కోరుతుంటే, కేసుల పేరిట బెదిరింపులకు దిగుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ఆదివారం సెలవు దినమైనా, ఐదో రోజు 'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆయన, ఉన్నతాధికారులతో సమావేశమై, కలెక్టర్లు, నోడల్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సెలవునాడు కూడా ఉద్యోగులు జన్మభూమిలో పాల్గొనడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన, సంక్రాంతి సందర్భంగా మరో రోజు అదనపు సెలవును ఇస్తానని చెప్పారు.
జన్మభూమికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, శనివారం నాడు దాదాపు 30 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. యూపీలో మాయావతి, అఖిలేష్ పొత్తు పెట్టుకున్న మరుసటి రోజే వారిపై సీబీఐని ప్రయోగించారని ఆరోపించిన చంద్రబాబు, పద్ధతి లేకుండా రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు తరిమికొట్టాలని అన్నారు. ప్రశాంతమైన కేరళలో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లు, నిరసనలకు కారణమైంది బీజేపీయేనని ఆరోపించారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా బీజేపీ సర్కారు ఇబ్బందులు పెడుతున్నా, వాటిని అధిగమించి పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు.