Karnataka: జాగ్రత్త.. ఏమనుకుంటున్నావో.. కాళ్లు చేతులు నరికేస్తా: అధికారిని బెదిరించిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే
- అటవీ భూమిలో ఆలయ నిర్మాణ పనులు
- అడ్డుకున్న అటవీ అధికారి
- ఫోన్ చేసి బెదిరించిన ఎమ్మెల్యే సంగమేశ్వర
గ్రామస్థులు చేపట్టిన గుడి నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోవద్దని, అటువంటి ప్రయత్నాలు చేస్తే కాళ్లు, చేతులు నరికేస్తానని బెదిరించిన ఎమ్మెల్యే వ్యవహారం తాజాగా బయటకు వచ్చి సంచలనానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం.. కర్ణాటకలోని భద్రావతి ప్రాంతంలో గ్రామస్థులందరూ కలిసి ఓ ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. శంకుస్థాపన కూడా చేశారు. అయితే, అది అటవీశాఖకు చెందిన భూమి అని, అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అటవీ అధికారి వారికి చెబుతూ నిర్మాణాన్ని అడ్డుకున్నారు.
గుడి నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీ అధికారిపై గ్రామస్థులందరూ కలిసి స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వరకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్థుల ముందే అధికారికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే చెడామడా వాయించారు. ఆలయ నిర్మాణానికి అడ్డు చెప్పవద్దన్నారు. గ్రామస్థులు వారి ఆచారం ప్రకారం పూజలు చేసుకున్నారని, వారికి అడ్డు చెప్పవద్దన్నారు. ఆలయ నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాళ్లు చేతులు నరికేస్తానని హెచ్చరించారు. మంచిగా చెబితో అర్థం చేసుకోవాలని, తాను హెచ్చరిస్తున్నానని మరోమారు తీవ్ర స్వరంతో చెప్పారు. గ్రామస్థులు పనులు మొదలు పెడతారని, ఒక్క అధికారి కూడా అక్కడకు వచ్చి అడ్డుకోవడానికి వీల్లేదని హెచ్చరించారు. ఈ వీడియో బయటకు రావడంతో సంగమేశ్వరపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.