KCR: కేసీఆర్ ను ఫోన్ లో బెదిరించిన వ్యక్తిపై కేసు.. విచారణ వాయిదా!
- విచారణకు హాజరుకావాలని ఆదేశం
- 2013లో చోటుచేసుకున్న ఘటన
- టీఆర్ఎస్ అధినేతకు మధు వినయ బెదిరింపు ఫోన్
2013లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓ వ్యక్తి ఫోన్ లో బెదిరించిన కేసులో అప్పట్లో ఫిర్యాదు చేసిన దాసోజు శ్రవణ్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. నెల్లూరుకు చెందిన మధు వినయ్ అనే వ్యక్తి అప్పట్లో కేసీఆర్ ను ఫోన్ లో బెదిరించడంతో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా వున్న దాసోజు శ్రవణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు మధు వినయ్ ని నిందితుడిగా తేల్చి, కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేడు కోర్టుకు హాజరు కావలసిన శ్రవణ్ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. దీంతో కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఆ రోజు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు శ్రవణ్ కు సమన్లు జారీ చేసింది.