telangana cabinet meet: తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం.. పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం
- 17 నుంచి అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో భేటీ
- పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
- నామినేటెడ్ కోటా భర్తీపై నిర్ణయం
ముఖ్యమంత్రి, హోం మంత్రి మాత్రమే ఉన్న తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో మంత్రి మహమూద్ అలీ, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై అధికారిక ప్రకటనతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంటరీ కార్యదర్శుల కోసం చేసిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
అలాగే, ఆంగ్లో ఇండియన్ కోటా ఎమ్మెల్యే భర్తీపైనా చర్చిస్తారని సమాచారం. తొలిసారి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగిన స్టీఫెన్‌సన్‌కే మళ్లీ ఈ కోటాలో అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. శాసన సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం కావడంతో పలు కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు, 19న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపైనా చర్చించనున్నారు.