India: ఇంతకన్నా గర్వపడాల్సిన సమయం మరొకటి రాదు: విరాట్ కోహ్లీ
- ఆసీస్ తో 2-1 తేడాతో సిరీస్ గెలిచిన భారత్
- ప్రజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లీ
- వన్డే, టీ-20ల్లోనూ సత్తా చాటుతామని వెల్లడి
ఆస్ట్రేలియాలో తొలిసారిగా టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్న భారత జట్టులోని ప్రతి ఆటగాడు గర్వపడాల్సిన సమయం వచ్చిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ ఉదయం నాలుగో టెస్ట్ ను డ్రాగా ప్రకటించిన తరువాత, ప్రజెంటేషన్ కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడాడు. "ముందుగా నేను చెప్పాల్సిందేమంటే, ఇంతకన్నా గర్వించే క్షణం మరొకటి ఉండదు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలోనే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాను. నాలుగేళ్ల తరువాత ఇక్కడ సిరీస్ గెలుస్తామని ఆ సమయంలో నాకు తెలియదు. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మా కుర్రాళ్లంతా ఈ సిరీస్ కోసం ఎంతో శ్రమించారు.
2011లో మేము ప్రపంచ కప్ ను గెలిచినప్పుడు, ఆటగాళ్లలో అందరికన్నా చిన్నవాడిని నేను. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లంతా ఎంతో భావోద్వేగంతో ఉన్న వేళ నాకు ఏమీ అనిపించలేదు. నేను ఆస్ట్రేలియాలో మూడు సార్లు పర్యటించాను. ఇప్పుడు సిరీస్ గెలిచిన వేళ, ఏదో తెలియని భావోద్వేగం కలుగుతోంది. ఇది జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. బ్యాటింగ్, బౌలింగ్ లో నిలకడగా రాణించడంతోనే కల సాకారమైంది.
ముఖ్యంగా చెప్పాల్సింది మయాంక్ అగర్వాల్ గురించి, బాక్సింగ్ డే నాడు నిజమైన చాంపియన్ గా నిలిచాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి, మూడో టెస్టులో విజయానికి కారకుడయ్యాడు. బౌలర్ల శ్రమ కూడా ఫలించింది. మొత్తం మీద ఇది మేము సెలబ్రేషన్స్ చేసుకునే సమయం" అని వ్యాఖ్యానించాడు. తదుపరి వన్డే, టీ-20 సిరీస్ ల కోసం తమ జట్టు ఎదురు చూస్తోందని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
అంతకుముందు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనీ మాట్లాడుతూ, భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు. సిరీస్ కోల్పోవడం నిరాశను కలిగిస్తోందని, అయితే, తమ కన్నా అన్ని విభాగాల్లో బలమైన భారత జట్టు ఇన్నాళ్లూ చేయలేకపోయిన పనిని చేసి చూపిందని అన్నాడు. మెల్ బోర్న్, సిడ్నీ టెస్టుల్లో తాము అనుకున్నంతగా రాణించలేదని, ఆసీస్ బౌలర్లు కొన్నిమార్లు విఫలమయ్యారని, ఆటగాళ్లు సరైన సమయంలో తమ బ్యాటుకు పని చెప్పలేదని అన్నాడు. వన్డే సిరీస్ కు తమ జట్టు మారుతుందని, భారత్ కు గట్టి పోటీ ఇస్తామని చెప్పాడు.