nitin gadkari: అదే జరిగితే.. నితిన్ గడ్కరీ ప్రధాని అయ్యే అవకాశం ఉంది: సంజయ్ రౌత్
- హంగ్ లోక్ సభ ఏర్పడే అవకాశం ఉందని బీజేపీ సీనియర్లు ఆందోళన చెందుతున్నారు
- గడ్కరీకి ఆరెస్సెస్, ఇతర బీజేపీ నేతల మద్దతు ఉంది
- మోదీ ప్రాభవం నానాటికీ తగ్గుతోంది
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాబోదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. హంగ్ లోక్ సభ ఏర్పడాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పత్రిక సామ్నాకు రాసిన సంపాదకీయంలో ఈ మేరకు సంజయ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రాభవం నానాటికీ తగ్గుతోందని... ఇదే సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రోజురోజుకూ బలపడుతున్నారని ఆయన తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో అస్పష్టమైన ప్రజాతీర్పు వెలువడబోతోందని... దీనికి కారణం మోదీనే అని సంజయ్ అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీని ప్రజలు కట్టబెట్టారని... అందివచ్చిన మంచి అవకాశాన్ని మోదీ వృథా చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ను ఓడించాలనే భావనతో ఆనాడు మోదీకి ప్రజలు మద్దతు పలికారని... కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందనే ఆందోళనలో ఆ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారని... ఇటీవల నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పారు.
ప్రత్యామ్నాయ నేతగా గడ్కరీని అంగీకరించేందుకు ఆరెస్సెస్, ఇతర బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని సంజయ్ తెలిపారు. గడ్కరీ రెండోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కాకుండా రాజకీయ కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడాలని గడ్కరీ వేచి చూస్తున్నారని... ఒకవేళ హంగ్ ఏర్పడితే... అత్యున్నత పదవిని (ప్రధాని) ఆయన చేపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.