railways: రైల్వే ప్లాట్‌ఫాం ఇక విశ్రాంతి ప్రాంతం కాబోదు... రైలు వచ్చే ముందే ప్రవేశం!
- భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే శాఖ నిర్ణయం
- ప్రయాణ సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందే అనుమతి
- మిగిలిన సమయాల్లో ప్రవేశ ద్వారాల మూసివేత
రైల్వే ఫ్లాట్‌ఫాంపై గంటలపాటు తిష్టవేసేందుకు ఇకపై కుదరదు. రైలు వచ్చే వరకు అక్కడే ఎక్కడో ఒక చోట కునుకు తీసేద్దామన్నా చెల్లదు. భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కఠిన నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఇకపై ప్రయాణికులను వారు వెళ్లే రైలు సమయానికి 15 నుంచి 20 నిమిషాల ముందే ప్లాట్‌పాం మీదకు అనుమతిస్తారు. అంతకు ముందు, ఆ తర్వాత ప్రవేశ ద్వారాలను మూసివేస్తారు. విమానాశ్రయాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్ల వంటివి చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్, కర్ణాటకలోని హుబ్లీ రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ అంశంపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 202 రైల్వే స్టేషన్లలో ఈ ఏకీకృత భద్రతా వ్యవస్థ (ఐఎస్‌ఎస్)ను అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రయాణికులు ఒకసారి ప్లాట్‌ఫాంలోకి ప్రవేశించాక ఎన్ని గేట్లు మూసివేయగలమన్నది పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం కొన్ని చోట్ల గోడలు నిర్మించడం, మరికొన్ని చోట్ల ఆర్పీఎఫ్ సిబ్బందిని నియమించడం చేయాల్సి ఉంటుందని తెలిపారు.
రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలు, యాక్సస్ కంట్రోల్, బ్యాగేజీ-ప్రయాణికుల స్క్రీనింగ్ వ్యవస్థ, బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసే పరికరాలను అమర్చనున్నట్లు తెలిపారు. స్టేషన్ ప్రయాణికులను ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని, రద్దీ ఎక్కువ ఉంటే స్టేషన్ బయటే ఈ ప్రక్రియ పూర్తి చేసి లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం రూ.385.06 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు.