Karnataka: తీగలాగితే డొంక కదిలింది...కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై దాడుల వెనుక కథ ఇదీ!
- రియల్ ఎస్టేట్ వ్యాపారి కపాలి మోహన్ ఇచ్చిన సమాచారం
- ఆయనతో లావాదేవీలున్న వారిపైనే దృష్టి
- మోహన్ ఆస్తులు ఇప్పటికే సీజ్
కర్ణాటక రాష్ట్రంలో పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడుల వెనుక పెద్ద కథే ఉందని తేలింది. ఆదాయ పన్ను శాఖ అధికారులకు లభించిన ఓ తీగ ఆధారంగా మొత్తం డొంకంతా కదిలిందని సమాచారం. వివరాల్లోకి వెళితే...కర్ణాటకలోని పలువురు సినీ హీరోలు, నిర్మాతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇటీవల వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇందుకు కారణం రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారి కపాలి మోహన్ నుంచి లభించిన సమాచారం ఆధారమని తేలింది. గత ఏడాది అక్టోబరులో కపాలి మోహన్ సీసీబీ చేతికి చిక్కారు. అతని వద్ద నుంచి లభించిన ఆధారాల మేరకు అతని వ్యవహారాలతో పలువురు సినీ నటులు, నిర్మాతలకు సంబంధాలున్నట్లు వెలుగు చూసింది. మోహన్ ఆస్తులను ఇప్పటికే సీజ్ చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆ తర్వాత మిగిలిన వారిపై దృష్టిసారించారని చెబుతున్నారు.
రజనీకాంత్ ‘పేట’ సినిమా పంపిణీ దారుడైన జాక్ మంజు (ఇతను నటుడు సుదీప్ సన్నిహితుడు) ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. అలాగే బడా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌పైనా దాడులు జరిగాయి. దాడులతో తాను ఆందోళన చెందుతున్నట్లు వచ్చిన వార్తలపై వెంకటేష్ మాట్లాడుతూ తాను సక్రమంగా పన్ను చెల్లిస్తున్నానని, అటువంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పారు. ఆదాయ పన్ను శాఖ వద్ద ఉన్న ఆధారాలకు, తన ఆడిటర్లు సమర్పించిన వివరాలు సరిపోయాయని చెప్పుకొచ్చారు. ఆదాయ పన్ను శాఖ దాడుల కారణంగా పేట, సార్వభౌమ సినిమాల విడుదల వాయిదా పడుతుందన్న వార్తలను జాక్ మంజు, వెంకటేష్‌లు కొట్టిపారేశారు.
కేజీఎఫ్ చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ మాట్లాడుతూ తాము ఉద్దేశపూర్వకంగా ఎటువంటి పొరపాటు చేయలేదని, జీఎస్టీ అమలైన తర్వాత కొన్ని లెక్కల్లో తేడాలు వచ్చాయని తెలిపారు. ఈగ ఫేం కిచ్చ సుదీప్ మాట్లాడుతూ తాను గతంలో ఎన్నడూ ఆదాయ పన్ను శాఖ దాడులు ఎదుర్కోలేదని చెప్పారు. నిరుడు తన ఆదాయ గణాంకాల్లో తేడాలు గుర్తించడంతో స్వచ్ఛందంగా రూ.70 లక్షలు పన్ను చెల్లించినట్లు వివరించారు.