nimmakur: నిమ్మకూరుకు మేమెంతో రుణపడి ఉంటాం..మాకు ఎంతో ఇచ్చిన ఊరిది: నటుడు కల్యాణ్ రామ్
- ఆడియో వేడుక ఇక్కడ నిర్వహించలేకపోయాం
- ఇక్కడి బంధువులను కలవాలని వచ్చాం
- ‘హ్యాట్సాఫ్ బాబాయ్’ అన్న కల్యాణ్ రామ్
నిమ్మకూరుకు తామెంతో రుణపడి ఉంటామని, ఈ ఊరు తమకెంతో ఇచ్చిందని ప్రముఖ నటుడు నందమూరి కల్యాణ్ రామ్ అన్నారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ‘యన్.టి.ఆర్’ సినిమా యూనిట్ ఈరోజు పర్యటించింది. ‘యన్.టి.ఆర్’ చిత్రంలో తన తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రం ఆడియో వేడుక ఇక్కడ నిర్వహించలేకపోయాం కాబట్టి, ఇక్కడి బంధువులందరినీ కలిసి వెళదామన్న మంచి కారణంతో బాబాయ్ బాలకృష్ణ ఇక్కడికి వచ్చారని, ‘హ్యాట్సాఫ్ బాబాయ్’ అంటూ బాలకృష్ణను కొనియాడారు.
ఎన్టీఆర్ జీవితం గురించి అందరికీ తెలుసు కానీ, ఆయన కుటుంబంలో ఏం జరిగింది, మా తాతయ్యకు నాయనమ్మ బసవతారకం ఎంత తోడూనీడగా ఉన్నారు, ఎంతగా ప్రభావితం చేశారు.. వంటి అంశాలతో ‘యన్.టి.ఆర్’ కథ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించబోతోందనడంలో ఎటువంటి అనుమానం లేదని, మనకు పండగ మూడురోజుల ముందే వస్తోందని, ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని అన్నారు.