India: తన కుమార్తెలకు సపర్యలు చేసేందుకు తల్లిని ఆస్ట్రేలియాకు తీసుకెళ్లిన కుమార్తె.. కోర్టును ఆశ్రయించిన తండ్రి!
- కర్ణాటకలోని బెంగళూరులో ఘటన
- తండ్రి బాగోగులు పట్టించుకోని కుమారుడు
- కేసు నమోదు చేసిన పోలీసులు
కన్నబిడ్డలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. చిన్నప్పటి నుంచి వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యేదాకా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటి తల్లిదండ్రులను వయసు మళ్లాక చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది. కానీ తాజాగా ఓ కుమార్తె మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. తన తండ్రిని పోషించడం దండగ అని భావించిన సదరు కుమార్తె తల్లికి మాయమాటలు చెప్పి ఆస్ట్రేలియాకు పట్టుకుపోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దీంతో సదరు పెద్దాయన తనకు న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించాడు.
కర్ణాటకలోని మునియప్ప లేఔట్‌కు చెందిన కృష్ణకుమారి, మృత్యుంజయ భార్యభర్తలు. వీరికి గీతామణి, వరుణ్ అనే పిల్లలున్నారు. గీతను ఆస్ట్రేలియాలో ఉంటున్న యువకుడికి ఇచ్చి తల్లిదండ్రులు వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో పిల్లల్ని చూసుకోవడానికి తల్లి కృష్ణకుమారిని తీసుకెళ్లాలని గీతామణి భావించింది. ఈ క్రమంలో తనతో వచ్చేయాలని తల్లిదండ్రులను కోరింది. అయితే ఇందుకు ఇద్దరూ నిరాకరించారు. ఈ క్రమంలో కొద్దిరోజులు తనతో ఉండి రావాలంటూ ఆరు నెలల క్రితం తల్లిని గీతామణి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది.
అనంతరం భారత్ కు తిరిగి పంపించలేదు. దీంతో ఒంటరివాడైన మృత్యుంజయను పక్క రాష్ట్రం తమిళనాడులోనే ఉంటున్న వరుణ్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వరుణ్ స్థానికంగా ఉండే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాలతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.