forward castes: అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ల నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమే: జేపీ
- నిరుపేదలకు రిజర్వేషన్ల ఫలితాలు కొంతైనా అందాలన్నది మంచిదే
- మరి, సుప్రీంకోర్టు ఏమంటుందో?
- చట్టపరంగా, రాజ్యాంగపరంగా ఇబ్బందులు
అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమేనని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ (జేపీ) అన్నారు. ఈ విషయమై విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మన సమాజాన్ని నిట్టనిలువుగా చీలుస్తున్న సమస్య, అన్ని వర్గాల్లో, యువతలో ఆవేశాన్ని తెస్తున్న సమస్య ఏదైనా ఉంటే అది రిజర్వేషన్ల సమస్యేనని అన్నారు.
నిరుపేదలకు రిజర్వేషన్ల ఫలితాలు కొంతైనా అందాలన్న ప్రయత్నం చేయడం మంచిదే కానీ, సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి విధించిందని అన్నారు. ఆ పరిమితి అలాగే ఉంచి, ఆ యాభై శాతంలోనే పది శాతం రిజర్వేషన్లు అగ్రవర్ణాలకు కేటాయిస్తే రాజకీయంగా, సామాజికంగా పెద్ద సంక్షోభం తలెత్తుతుందని, ఇది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. మరి, యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించాలంటే సుప్రీంకోర్టు ఏమంటుందోనని అన్నారు.
ఈ దేశంలో రిజర్వేషన్ల పేరుతో ఉన్నటువంటి ఈ కలహాలకు సామరస్యమైన పరిష్కారం సాధించాలని, అన్ని వర్గాల్లో ఉన్న పేదలకు న్యాయం చేయాలన్న జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వ సంకల్పం మంచిదేనని ప్రశంసించారు. కానీ, దానికి చట్టపరంగా, రాజ్యాంగపరంగా, సుప్రీంకోర్టు తీర్పుల పరంగా ఇబ్బందులున్నాయి కనుక, భవిష్యత్ ఏమవుతుందో చూద్దామని జేపీ అన్నారు.
ఈ విషయమై ఈ దేశంలో మొట్టమొదటి సారిగా లోక్ సత్తా ఒక స్పష్టమైన పరిష్కారాన్ని చాలా సమగ్రంగా, పత్రికల ద్వారా, చర్చల ద్వారా ప్రజల ముందు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక చర్చకు దారి తీస్తుందని భావిద్దామని, పరిష్కారం సాధ్యమని నమ్ముతున్నానని జేపీ అభిప్రాయపడ్డారు.