Andhra Pradesh: మిషన్ భగీరథకు దళారుల బెడద.. డబ్బులిస్తే కనెక్షన్ ఇస్తామంటూ బేరసారాలు!

  • రంగారెడ్డి జిల్లా దుండిగల్ లో ఘటన
  • ప్రాజెక్టు అధికారినంటూ రంగంలోకి దళారి
  • పోలీసులకు అప్పగించాలంటున్న అధికారులు

ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పథకాల వరకూ దళారులు ప్రతీచోటా కనిపిస్తూ ఉంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకానికి సైతం దళారుల సెగ తగిలింది. ఈ పథకం కింద త్వరగా మంచినీటి కనెక్షన్ మంజూరు అయ్యేలా చేస్తామని ఓ వ్యక్తి నమ్మబలికాడు. ఇందుకు భారీగా డబ్బును డిమాండ్ చేశాడు. చివరికి ఈ విషయం అధికారులకు చేరడంతో ఈ తతంగాన్ని వారు అడ్డుకున్నారు.

రంగారెడ్డి జిల్లా దుండిగల్ మండలం దూలపల్లి గ్రామానికి వచ్చిన సతీశ్ అనే వ్యక్తి తాను మిషన్ భగీరథ ప్రాజెక్టులో అధికారిగా పనిచేస్తున్నానని తెలిపాడు. ఈ పథకం కింద మంచి నీటి కనెక్షన్లు కావాలంటే రేకుల ఇంటికి రూ.500, ఒక అంతస్తుకు రూ.2,200, రెండు అంతకంటే ఎక్కువ అంతస్తులున్న ఇంటికి రూ.4,000 చెల్లించాలని కోరాడు.

అయితే అతనిపై అనుమానం వచ్చిన ఓ వ్యక్తి మీడియాకు ఫోన్ చేయడంతో విషయం అధికారుల వరకూ వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సతీశ్ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని స్పష్టం చేశారు. అతను ఓ దళారి అని చెప్పారు. దరఖాస్తు చేసుకుంటే మిషన్ భగీరథ కింద రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. దళారులు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తే పోలీసులకు అప్పగించాలని సూచించారు.

  • Loading...

More Telugu News