Tamil Nadu: అటవీ శాఖ ఉద్యోగిపై దాడిచేసి చంపేసిన ఏనుగు
- ఏనుగులను తరిమేసే పనిలో ఉండగా ఘటన
- తొండంతో విసిరి, కాళ్లతో తొక్కేసి చంపిన గజం
- డెంకణీకోట సమీపంలోని తావరకరై అటవీ ప్రాంతంలో ఘటన
కర్ణాటకలోని హోసూరు సమీపంలోని డెంకణీకోట సమీపంలోని తావరకరై అటవీ ప్రాంతంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ అటవీ ఉద్యోగిని ఏనుగు ఒకటి తొక్కి చంపేసింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని డెంకణీకోట అటవీ ప్రాంతంలో ఇటీవల 30 ఏనుగులు మకాం వేసి చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో అటవీ శాఖ సిబ్బంది ఈ ఏనుగును సమీపంలోని కర్ణాటక అడవుల్లోకి తరిమేసేందుకు చర్యలు చేపట్టారు.
వీటిని తరుముతుండగా గున్న ఏనుగు ఒకటి వెనుకబడింది. గుంపులోని తల్లి ఏనుగు తన పిల్లకు ఏదో అపాయం జరుగుతుందని భావించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి సిబ్బందిని వెంబడించింది. అందరూ భయంతో పారిపోగా మారప్ప (55) అనే అటవీ ఉద్యోగి తల్లి ఏనుగుకు దొరికిపోయాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఏనుగు మారప్పను తొండంతో విసిరికొట్టి కాళ్లతో తొక్కి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న మారప్పను మిగిలిన సిబ్బంది డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు ధ్రువీకరించారు. మారప్పకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.