Chandrababu: కర్నూల్ కి హైకోర్టు బెంచ్ తేవడానికి కృషి చేస్తా!: ఏపీ సీఎం చంద్రబాబు
- హైకోర్టు బెంచ్‌తో పాటు విమాన సర్వీసులపై ప్రకటన
- ఎత్తిపోతల పథకాలతో జలధార పారిస్తామని వెల్లడి
- ఓర్వకల్లులో పారిశ్రామిక వాడ
జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించారు. కోస్గి గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ జిల్లాను అన్ని విధాలా అభివృద్ధిపథంలో నడిపించనున్నట్లు ప్రకటించారు.
అమరావతిలో హైకోర్టు ఏర్పాటైనందున కర్నూల్లో బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కర్నూల్ ఎయిర్ పోర్టు నుంచి అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు విమాన సర్వీసులు నడిచేలా చూస్తానని చెప్పారు. కర్నూల్ జిల్లాలో 97 ఎత్తిపోతల పథకాలు ఇప్పటికే పూర్తి చేశామని, వాటి ద్వారా జిల్లాలో జలధార పారిస్తామని తెలిపారు.
ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అందిస్తామన్నారు. ఓర్వకల్లు పెద్ద పారిశ్రామిక వాడగా మారనుందని, దాదాపు 200 నూతన కంపెనీలు ఏర్పాటవుతున్నాయని చెప్పారు. గని ఆల్ట్రా మెగాపవర్ సోలార్ పార్క్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద పార్క్ అని చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్‌లు ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.