Loksabha: 'అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్' బిల్లును జేపీసీకి పంపాలి: కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ డిమాండ్
- జేపీసీ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందాం
- అసలు, ఇంత తొందరపాటు నిర్ణయం ఎందుకు?
- ఈ బిల్లులో చట్టపరంగా ఎన్నో లోటుపాట్లున్నాయి
అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీ థామస్ విమర్శలతో పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చాలా తొందరపాటుగా వ్యవహరిస్తోందని, ఏ తొందరపాటు నిర్ణయమైనా అనేక సమస్యలకు దారితీస్తుందని అన్నారు.
ఈ ప్రభుత్వానికి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉందని, ఇంత తొందరపాటుతో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పులు చేసుకుంటూ పోతోందని, అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు.
ఈ బిల్లులో చట్టపరంగా ఎన్నో లోటుపాటులున్నాయని, ఈ రిజర్వేషన్లు కల్పించడానికి అసలు ప్రాతిపదిక ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు చూస్తుంటే ఇది పేదల కోసం తెచ్చినట్టు లేదని, ఈ ప్రభుత్వం పార్లమెంట్ ను కూడా ఒత్తిడిలోకి నెట్టాలని చూస్తోందని, ఈ బిల్లులో ఉన్న అంశాలను పూర్తిగా తెలుసుకునేందుకు అవకాశం లేకుండా హడావుడిగా తెచ్చారని ధ్వజమెత్తారు.
ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడటమే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత లోక్ సభకు దాదాపుగా ఇవే ఆఖరి సమావేశాలని, ఇలాంటి సమయంలో ఈ బిల్లు తీసుకొచ్చిన విధానం ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోందని, ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపాలని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుందామని కేవీ థామస్ సూచించారు.
నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో మొదటిసారి ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కానీ, దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తుచేశారు. ఆ అనుభవం దృష్ట్యా ఈ బిల్లులో ఎన్నో చట్టపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయని అన్నారు. అసలు, ఈ దేశంలో ఉద్యోగ కల్పన ఎక్కడ ఉంది? ఈ ప్రభుత్వం ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఐదేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు రావాల్సి ఉంది కానీ, అలా జరగలేదని విమర్శించారు.