Lok Sabha: రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బిల్లు ద్వారా ప్రయత్నిస్తున్నాం: అరుణ్ జైట్లీ

  • అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే ఈ ప్రయత్నం
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకొస్తాం
  • ఈ బిల్లుకు అన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు 

రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ బిల్లు ద్వారా ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే ఈ ప్రయత్నమని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్నదే ఈ బిల్లు ఉద్దేశమని, ఈ బిల్లుకు అన్ని రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని స్పష్టం చేశారు.

అప్పటి ప్రధాని  పీవీ నరసింహారావు హయాంలో దీనిపై ప్రత్యేక చట్టం ఏమీ చేయలేదని, అందుకే, దీనిని కోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. ఆర్టికల్ 16(4)లో కులాల ఆధారంగా రిజర్వేషన్ల ప్రస్తావన ఉందని, అవి 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు చెబుతోందని, కానీ, మేము ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు అనే అంశాన్ని చేర్చడం వల్ల న్యాయపరమైన సమస్యలే రావని అభిప్రాయపడ్డారు.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులన్నీ కూడా ఆర్టికల్ 16(4)కి సంబంధించినవేనని, ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలన్నీ దాని ఆధారంగానే చేశాయని, అందుకే, రిజర్వేషన్ల పెంపులో వాళ్ల ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయని విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకూ నాణ్యమైన అవకాశాలు కల్పించే ఈ ప్రయత్నంలో తప్పేముందని ప్రశ్నించారు. 

  • Loading...

More Telugu News