Andhra Pradesh: ఏపీలో అసైన్డ్, చుక్కల భూముల సమస్య పరిష్కరించాలి.. కార్యాచరణ ప్రకటించాలి: సినీ హీరో శివాజీ
- కార్యాచరణ ప్రకటిస్తే 15 రోజుల్లోనే సమస్యకు పరిష్కారం
- అధికారుల జాప్యంతో ఈ సమస్య మరింత జటిలం
- రైతులు నలిగిపోతున్నారు
ఏపీలోని అసైన్డ్ , చుక్కల భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని, ఓ కార్యాచరణను ప్రకటించాలని సినీ హీరో శివాజీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీనిపై ప్రభుత్వం కార్యాచరణను ప్రకటిస్తే కనుక కేవలం పదిహేను రోజుల్లోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
అసైన్డ్, చుక్కల భూములకు సంబంధించి రైతుల వద్ద ఎటువంటి ఆధారం ఉన్నా ఆ భూమి రైతులకే చెందుతుందని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. రెవెన్యూ అధికారుల జాప్యం కారణంగా ఈ సమస్య మరింత జటిలమైందని, తమ భూములను రైతులు కొనేందుకు, విక్రయించేందుకు వీల్లేక పోవడంతో రైతులు నలిగిపోతున్నారని అన్నారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబుని శివాజీ ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన చర్చించారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని శివాజీకి బాబు హామీ ఇచ్చారు.