Andhra Pradesh: అగ్రవర్ణాల పేదలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంటే.. టీడీపీ సహకరిస్తోంది!: జీవీఎల్ ఆగ్రహం
- గొప్ప ఉద్దేశంతో ఈబీసీ బిల్లును తీసుకొచ్చాం
- టీడీపీ సభ్యులు వెల్ లోకి ఎందుకెళ్లారు?
- విపక్షాలపై మండిపడ్డ నరసింహారావు
కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు లబ్ధి చేకూర్చాలన్న గొప్ప ఉద్దేశంతో ఈబీసీ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. అయితే ఈ బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు రాజ్యసభలో ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు. పేదలకు లబ్ధి చేరకుండా ఉండేందుకు కాంగ్రెస్, టీడీపీ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి గొడవ చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పేదలకు అన్యాయం చేస్తుంటే, టీడీపీ వారికి సహకరిస్తోందని మండిపడ్డారు. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన నేపథ్యంలో జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. అసలు టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, తోట విజయలక్ష్మీ, కనకమేడల రవీంద్ర కుమార్ వెల్ లోకి ఎందుకు వెళ్లారని జీవీఎల్ ప్రశ్నించారు.
కాపులు, రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మణ వర్గాల్లోని పేద విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అవకాశాలు ఇవ్వాల్సి వచ్చేసరికి అడ్డుపడుతూ, కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఇస్తోందని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. పేదల నోరు కొట్టవద్దని కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.