Andhra Pradesh: ‘విజయ సంకల్ప స్తూపం’ను ఆవిష్కరించిన జగన్.. ముగిసిన ప్రజాసంకల్ప యాత్ర!
- జగన్ ను ఆశీర్వదించిన వేదపండితులు
- 3,648 కిలోమీటర్లు నడిచిన వైసీపీ అధినేత
- 341 రోజుల పాటు సాగిన పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ చేబట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురంలో ముగిసింది. ఈ పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన ‘విజయ సంకల్ప స్తూపాన్ని’ ఈ సందర్బంగా జగన్ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. అంతకుముందు విజయ సంకల్ప స్తూపం వద్దకు జగన్ చేరుకోగానే జై జగన్.. జై జై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు.
వేదపండితులతో పాటు మతపెద్దలు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలకు జగన్ చేతులెత్తి అభివాదం చేశారు. 2017, నవంబర్ 6న ఇడుపుల పాయలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమయింది. ఇందులో భాగంగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర జగన్ నడిచారు.