Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్, వైఎస్ అభిమానుల వల్లే ఓడిపోయాం!: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- లోక్ సభ ఎన్నికల్లోనూ మహాకూటమి పోటీచేయాలి
- చంద్రబాబు జాతీయ స్థాయి నేత
- మీడియాతో మాట్లాడిన సంగారెడ్డి ఎమ్మెల్యే
2019 లోక్ సభ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే తెలంగాణలో ప్రజాకూటమి(మహాకూటమి) ఓడిపోయిందనడం సరికాదన్నారు. తెలంగాణ సీఎల్పీ నేతను ఈ నెల 18లోగా ఎన్నుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలిపారు. ఒకవేళ కుదరకుంటే పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నిర్ణయించిన వ్యక్తి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఓ మీడియా ఛానల్ తో జగ్గారెడ్డి మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ టీఆర్ఎస్ లో చేరరని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మెదక్ పార్లమెంటు స్థానాన్ని తన భార్యకు ఇస్తే గెలిపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో మెజారిటీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు సంతోషంగా లేరని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆయనతో జాతీయ స్థాయిలోనే పొత్తు పెట్టుకున్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ అధినేత జగన్ మద్దతుదారులు టీఆర్ఎస్ కు భారీగా క్రాస్ ఓట్లు వేశారనీ, అందువల్లే ఎక్కువగా నష్టపోయామని అన్నారు. అంతేతప్ప చంద్రబాబు కారణంగా మహాకూటమి(ప్రజాకూటమి) ఓడిపోలేదని స్పష్టం చేశారు.