Andhra Pradesh: ఏపీలో ఫిన్ టెక్ రంగం అభివృద్ధికి సీఐఐ సహకారం అందించనుంది: మంత్రి నారా లోకేశ్
- బజాజ్ ఫిన్ సర్వ్ ఎండీ సంజీవ్ బజాజ్ తో భేటీ అయ్యా
- ఓ ఒప్పందం కుదిరింది
- సీఐఐ సమన్వయ వేదిక ఏర్పాటు చేయనున్నాం
ఆంధ్రప్రదేశ్ లో ఫిన్ టెక్ రంగం అభివృద్ధికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సహకారం అందించనుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో బజాజ్ ఫిన్ సర్వ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ బజాజ్ తో జరిగిన సమావేశంలో ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆర్బీఐ దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక రంగంలో ఉన్న సంస్థలతో సీఐఐ సమన్వయ వేదిక ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫిన్ టెక్ రంగంతో పాటు వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఆర్ టి జి గురించి సంజీవ్ బజాజ్ కి వివరించినట్టు చెప్పారు. విశాఖపట్నం ఫిన్ టెక్ హబ్ గా మారుతుందని, ఫిన్ టెక్ సంస్థలు ఏపీకి వచ్చే విధంగా యూజ్ కేస్ రిపాజిటరీ ఏర్పాటు చేశామని, ఇప్పటికే 25 ఫింటెక్ కంపెనీలు వైజాగ్ లో కార్యకలాపాలు ప్రారంభించినట్టు చెప్పానని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వినియోగంతో ఇన్ని కార్యక్రమాలు, రియల్ టైం గవర్నెన్స్ అమలు చేయడం మొదటిసారి చూస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ లో ఫిన్ టెక్ రంగం అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సంజీవ్ బజాజ్ హామీ ఇచ్చారని లోకేశ్ పేర్కొన్నారు.