Vijayan: ఏడు పదుల వయసులో.. 23 దేశాలు తిరిగొచ్చిన 'ఛాయ్ వాలా' దంపతులు!
- కాఫీ హౌస్‌ను నడుపుతున్న విజయన్ జంట
- టీ కొట్టును తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు
- తిరిగొచ్చాక కష్టపడి అప్పు కట్టేస్తారు
ఓ జంట 23 దేశాలు తిరిగొచ్చింది. మంచి సౌండ్ పార్టీ అయి ఉంటుందనో.. యంగ్ కపుల్ అయి ఉంటుందనో అందుకే అన్ని దేశాలు తిరిగొచ్చుంటారు అని భావిస్తే తప్పులో కాలేసినట్టే. టీ అమ్ముకుంటూ.. 70 ఏళ్ల వయసులో ఆ భార్యాభర్తలు 23 దేశాలు తిరిగొచ్చారు. కేరళలోని కొచ్చి నగరంలోని గిరినగర్‌లో శ్రీ బాలాజీ కాఫీ హౌస్‌ను విజయన్, ఆయన భార్య మోహన కలిసి పగలనక, రాత్రనక కాలంతో పోటీపడి కష్టపడుతూ నడుపుతున్నారు.
ప్రతి పర్యటనకు ముందు తమ టీ కొట్టుని బ్యాంకుకు తనఖా పెట్టి అప్పు తీసుకుంటారు. తిరిగొచ్చాక కష్టపడి ఆ అప్పు కట్టేస్తారు. రెండు, మూడేళ్లు కష్టపడి అప్పు తీర్చాక మరో పర్యటనకు సిద్ధమవుతారు. వీళ్ల గురించి తెలుసుకున్న మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర.. ఈ జంట గురించి ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. దేశంలోని అత్యంత ధనికులు వీళ్లేనని.. కొచ్చికి వెళ్లినపుడు విజయన్ టీకొట్టుకు వెళ్లి టీ తాగి వస్తానని ట్వీట్లో పేర్కొన్నారు.