YSRCP: ప్రజాసంకల్ప యాత్ర ఇంతటితో ముగిస్తున్నా.. ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది: వైఎస్ జగన్
- ఏపీ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉంది
- ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలి
- మనం యుద్ధం చేయాల్సింది చంద్రబాబు వంటి నారా రాక్షసుడితోనే కాదు
‘ఈ ప్రజాసంకల్ప యాత్ర ఇంతటితో ముగిస్తున్నా.. ఈ పోరాటం ఇంకా కొనసాగుతుంది’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆయన ప్రజా సంకల్ప యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికలు రావడానికి మరో మూడు నెలల కాలం ఉందని, ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపాలని కోరారు. ఈ మూడు నెలల కాలంలో ప్రతిఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్కరినీ తనకు తోడుగా రమ్మనమని కోరుతున్నానని అన్నారు.
చంద్రబాబునాయుడు వంటి నారా రాక్షసుడితోనే కాదు మనం యుద్ధం చేసేది, ఈ చంద్రబాబుకు తోడుగా ఎల్లో మీడియా ఉందని, వ్యవస్థను మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో రెండు పత్రికలు, ఈ పెద్ద మనిషికి తోడుగా ఉన్న అనేక ఛానెల్స్ తో కూడా యుద్ధం చేస్తున్నామని అన్నారు. ఇవన్నీ కాక, జిత్తులమారి చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడని, అన్యాయమైన కార్యక్రమాలు చేస్తాడని ఆరోపించారు.
ప్రజలంతా తనకు తోడుగా ఉంటే ఈ అన్యాయాలను, మోసాలను తాను కచ్చితంగా జయిస్తానని చెప్పారు. తోడుగా ఉండమని, ఆశీర్వదించమని, ప్రతి అక్కాచెల్లెకి, అవ్వాతాతకి, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరుపేరున విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను’ అని జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.