Supreme Court: అయోధ్య కేసు ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్.. 29కి విచారణ వాయిదా!
- ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ లలిత్
- గతంలో న్యాయవాదిగా కేసు వాదనల్లో లలిత్
- ప్రస్తుత న్యాయవాదుల అభ్యంతరం
రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో విచారణ తిరిగి మొదటికి వచ్చింది. ఈ కేసును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని గత వారంలో తేల్చి చెప్పిన సీజే రంజన్ గొగొయ్, ఐదుగురి పేర్లను ప్రకటించగా, అందులో భాగమైన జస్టిస్ లలిత్, ఈ ఉదయం ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. దీంతో మరో ధర్మాసనాన్ని ప్రకటిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
గతంలో అయోధ్య కేసులో కల్యాణ్ సింగ్ తరఫున ప్రస్తుతం జస్టిస్ గా ఉన్న లలిత్ వాదించారని గుర్తు చేసిన న్యాయవాది రాజీవ్ ధావన్, ఆయన వాదనలు ఎలా వింటారన్న ప్రశ్నను లేవనెత్తారు. ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఉండటంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో, తాను తప్పుకుంటున్నట్టు జస్టిస్ లలిత్ ప్రకటించారు. దీంతో మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన సీజే, విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.