Vizag: కాబోయే భార్యను దారుణంగా హత్య చేసిన యువకుడికి విశాఖ కోర్టు అరుదైన శిక్ష!
- విశాఖలో 2017, జూలై 8న భవాని హత్య
- ఇంటికి పిలిపించి కిరాతకంగా చంపిన సతీశ్
- రెండు యావజ్జీవ శిక్షలు విధించిన న్యాయస్థానం
ప్రేమించి, పెద్దలను ఒప్పించి, ఆపై అనుమానం పెనుభూతం కాగా, ప్రియురాలిని దారుణంగా హతమార్చిన నిందితుడికి విశాఖపట్నం కోర్టు అరుదైన శిక్షను విధించింది. అద్దాన్ని పగులగొట్టి దానితో ప్రియురాలి గొంతు కోసి, రక్తమోడుతున్న ఆమెను నిర్దయగా బయటకు ఈడ్చుకుంటూ వచ్చిన దోషికి రెండు యావజ్జీవ శిక్షలు విధిస్తున్నామని, ఏకకాలంలో ఈ శిక్షలు అనుభవించాలని తీర్పిచ్చింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే, 2017 జులై 8న పూర్ణామార్కెట్ సమీపంలో గల పండావీధిలో బూరలి భవాని (18) హత్య తీవ్ర కలకలం రేపింది. 2014 నుంచి ఆమెను ప్రేమిస్తున్న సతీష్ కుమార్ (25) పెళ్లి చేసుకుంటానని చెప్పగా, ఇరు కుటుంబాలూ అంగీకరించి, పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సమయంలో సతీష్ ప్రవర్తన కూడా మారింది. భవానిపై అనుమాన పడుతూ, అసభ్యకరంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఆమెకు అక్రమ సంబంధం అంటగట్టాడు.
హత్య జరిగిన రోజు మధ్యాహ్నం భవానికి ఫోన్ చేసి తన ఇంటికి పిలిచిన సతీశ్, ఆ సమయంలో ఇంట్లో ఎవరినీ లేకుండా చేసి, హత్యకు పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో కేకలు పెడుతూ ఆమె రోడ్డుపైకి రాగా, కొందరు స్థానికులు కాపాడేందుకు ప్రయత్నిస్తే, వారిపైనా గాజుతో దాడి చేశాడు. వారు భయపడి చూస్తుండగానే, మరోసారి పొడిచాడు. ఇనుప డంబెల్ తో తలపై మోదాడు. ఆ వెంటనే భవాని ప్రాణాలు కోల్పోగా, శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. ఆపై స్థానికులు ఏకమై అతన్ని చావగొట్టి పోలీసులకు అప్పగించారు.
ఈ కేసు విచారణ దాదాపు ఏడాదిన్నర పాటు సాగింది. ఒక దోషికి రెండు జీవితఖైదులు విధించడం విశాఖపట్నం చరిత్రలో అరుదైన విషయమని పలువురు న్యాయవాదులు వ్యాఖ్యానించారు. అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన సతీశ్ కు ఇది సరైన శిక్షేనంటున్నారు.