indira gandhi: ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులు కావాలి: పార్టీ నేతలతో పవన్ కల్యాణ్
- ఏపీ రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయి
- జనసేన మద్దతుతో 2014లో టీడీపీ, బీజేపీ గెలిచాయి
- ప్రజాసేవ చేయాలన్న సదుద్దేశంతోనే ప్రజారాజ్యంను చిరంజీవి స్థాపించారు
జిల్లాలవారీగా జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశాలు నిర్వహిస్తూ, దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈరోజు కడప జిల్లా నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ లాంటి ఒత్తిడిని తట్టుకునే బలమైన నేతలు కావాలని ఆయన అన్నారు. కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని 2014లో అనుకున్నామని... అయితే కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తే పార్టీ బలోపేతం కాదనే భావనతో ఆ ఆలోచనను విరమించుకున్నామని చెప్పారు. బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇవ్వడంతో వారు గెలిచారని తెలిపారు.
ఏపీలోని రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి సీఎం చేయండని టీడీపీ కోరుతుంటే, ఒక్క అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరుతోందని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారని... కానీ, పక్కనున్న వారే నిరాశకు గురిచేశారని అన్నారు.