gudipoodi: 'పాతాళ భైరవి'కి ముందు ఎన్టీఆర్ పస్తులున్నారు: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి
- కాలేజ్ రోజుల్లో ఎన్టీఆర్ నాటకాలు వేసేవారు
- 'పాతాళభైరవి' తరువాత వెనుదిరిగి చూసుకోలేదు
- ఆయనని చూడటానికి జనం జాతరలా వచ్చేవారు
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. "కాలేజ్ రోజుల్లోనే ఎన్టీఆర్ నాటకాలు వేసేవారు. అలా నాటకాల్లో ఆయనకి గల అనుభవమే సినిమాల్లో వేషం తెచ్చిపెట్టింది. చెన్నై వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ .. నేను కలుసుకున్నాము. 'మా నాన్న ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చాను .. మళ్లీ వాళ్లను డబ్బులు అడిగి ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ నా బతుకు నేను బతకాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ వచ్చే కొద్దిపాటి డబ్బుతో ఎలాగో అలా నెట్టుకురావాలి' అని చెప్పారు.
ఇదంతా 'పాతాళభైరవి' సినిమా చేయడానికి ముందు. ఆ సినిమా చేసిన తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 'పాతాళ భైరవి'కి ముందు దగ్గరున్న డబ్బులు అయిపోవడంతో, రెండు రోజుల పాటు తాను పస్తులు వున్నట్టుగా కూడా ఎన్టీఆర్ నాకు చెప్పారు. అలాంటి ఎన్టీఆర్ ఆ తరువాత అలా ఎదిగిపోయారు. ఎన్టీఆర్ ను చూడటానికి జనం ఒక జాతరలా ఆయన ఇంటికి వచ్చేవారు" అని చెప్పుకొచ్చారు.