YSRCP: తిరుమల చేరుకున్న వైఎస్ జగన్.. స్వాగతం పలికిన వేదపాఠశాల పండితులు!
- టీటీడీ వేదపాఠశాల పండితుల స్వాగతం
- జగన్ కు పూర్ణకుంభంతో స్వాగతించే యత్నం
- కానీ, మీడియాను చూసి పక్కన పెట్టేసిన వైనం
అలిపిరి నుంచి ఈరోజు మధ్యాహ్నం కాలి నడకన బయలుదేరిన వైఎస్ జగన్ తిరుమల చేరుకున్నారు. టీటీడీ వేదపాఠశాల పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అయితే, జగన్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ, మీడియాను చూసి ఆ పూర్ణకుంభాన్ని పక్కన పెట్టి వేదాశీర్వచనం మాత్రమే పండితులు చేశారు. టీటీడీ వేదపాఠశాల నుంచి పండితులు జగన్ కు స్వాగతం పలికేందుకు రావడంపై విమర్శలు తలెత్తాయి.
మరి కొద్ది సేపట్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని జగన్ దర్శించుకోనున్నారు. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిన్నటితో ముగిసింది. ఈరోజు ఉదయం ఆయన తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి గెస్ట్ హౌస్ లో దిగిన జగన్, ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన బయలు దేరారు.