CII: పన్ను మినహాయింపు పరిమితిని పెంచండి.. కేంద్రానికి సీఐఐ విజ్ఞప్తి
- ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్
- రూ.1.50-2.50 లక్షలకు పెంచాలని వినతి
- కార్పొరేట్ పన్నును తగ్గించాలి
ప్రస్తుతం మన దేశంలో రూ.2,50,000 వరకూ వార్షిక ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తోంది. దీనిని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) విజ్ఞప్తి చేసింది. పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని సీఐఐ విన్నవించింది. కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించిన ముందస్తు బడ్జెట్ వినతుల్లో భాగంగా సీఐఐ పలు సిఫారసులు చేసింది. ఫిబ్రవరి 1న పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. దీంతో సీఐఐ ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేసింది.
అలాగే, పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు సెక్షన్ 80సి కింద కల్పిస్తున్న మినహాయింపు పరిమితిని రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పెంచాలని సూచించింది. 30 శాతం నుంచి 25 శాతానికి వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబును తగ్గించాలని సీఐఐ కోరింది. వైద్య ఖర్చులు, రవాణా భత్యాలను మినహాయించుకునే వీలు కల్పించాలని సూచించింది. అలాగే కార్పొరేట్ పన్నును కూడా తగ్గించాలని సీఐఐ సిఫారసులో కోరింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.