Flight: ఐఆర్‌సీటీసీ ఆఫర్.. విమాన టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులకు రూ.50 లక్షల ప్రయాణ బీమా
- దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఉచితం
- ప్రమాదానికి గురైన వారి కుటుంబాలకు అండ
- వన్ వే లేదా రౌండ్ ట్రిప్ చేసే ప్రయాణికులకు వర్తిస్తుంది
విమాన ప్రయాణికులకు ఉచితంగా ట్రావెల్ ఇన్స్యూరెన్స్‌ను అందిస్తున్నట్టు పేర్కొంటూ భారతీయ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) నేడు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఐఆర్‌సీటీసీ ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో టికెట్లను బుక్ చేసుకునే వారికి ఉచితంగా రూ.50 లక్షల మేర ప్రయాణ బీమా కల్పిస్తామని ప్రకటనలో పేర్కొంది.
ఐఆర్‌సీటీసీతో కలిసి భారతీ ఏఎక్స్‌ఏ జనరల్ ఇన్స్యూరెన్స్ సంయుక్తంగా ఈ బీమా కల్పించనుంది. ప్రయాణికులు ప్రమాదవశాత్తు చనిపోవడం లేదా శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఈ బీమా ఇవ్వనున్నట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది. బీమా ప్రీమియంను ప్రయాణికుల తరుపున ఐఆర్‌సీటీసీ చెల్లిస్తోంది. ఈ బీమా వన్ వే లేదా రౌండ్ ట్రిప్ చేసే ప్రయాణికులకు ఇది వర్తిస్తుంది.