CBI: అలోక్ వర్మ తొలగింపు నేపథ్యంలో.. సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద ఢిల్లీ పోలీసుల భద్రత
- అలోక్‌వర్మ ఉద్వాసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల కవచం
- గురువారం రాత్రే తమ అధీనంలోకి తీసుకున్న బలగాలు
- అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కేంద్రం చర్యలు
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ ఉద్వాసన పలికిన నేపథ్యంలో ఢిల్లీలోని సంస్థ కార్యాలయాన్ని ఢిల్లీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. వర్మ ఉద్వాసన నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రం ఈ విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. సీబీఐలో అంతర్గత కుమ్మలాటల నేపథ్యంలో రెండు నెలల క్రితం అలోక్ వర్మను బవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపగా సుప్రీం కోర్టు ఈ నిర్ణయానికి బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో తిరిగి బాధ్యతలు చేపట్టిన వర్మ రాగానే ఇద్దరు జాయింట్ డైరెక్టర్లతోపాటు మొత్తం ఐదుగురు అధికారులను బదిలీ చేశారు.
ఈ నేపధ్యంలో సమావేశమైన కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్ పోస్టు నుంచి తొలగించి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. వర్మ తొలగింపును విపక్షాలు రాజకీయ కక్షసాధింపుగా పేర్కొంటూ ఆక్షేపణలు వ్యక్తం చేస్తుండడంతో నిరసనలు, ధర్నాలు జరిగే ప్రమాదం ఉందని ఊహించిన కేంద్రం కార్యాలయం భద్రతను ఢిల్లీ పోలీసుల చేతుల్లో పెట్టింది. దీంతో గురువారం రాత్రే సీబీఐ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు పరిసరాల్లో భద్రతను పటిష్టపరిచారు.