Cheating: ప్రేమ అన్నాడు.. పెళ్లి అన్నాడు.. అవసరం తీరాక ముఖం చాటేశాడు!
- మూడేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లికి నిరాసక్తత
- భార్య గర్భవతి అని తేలగానే విముఖత
- ఆత్మహత్యా యత్నం చేసిన బాధితురాలు
మూడేళ్లు సహజీవనం చేశాడు. ప్రత్యేకంగా కాపురంపెట్టి చుట్టుపక్కల వారికి భార్యగా పరిచయం చేశాడు. తీరా ఆమె గర్భవతి అయ్యాక పెళ్లికి ముఖం చాటేయడంతో ఆమె ఆత్మహత్యా యత్నం చేసింది. వివరాల్లోకి వెళితే...కడప జిల్లాకు చెందిన ఓ యువతి (26), అదేప్రాంతానికి చెందిన షేక్ సమీర్ (28) ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చారు.
యుసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. చుట్టుపక్కల వారికి తాము దంపతులమనే చెప్పారు. షేక్ సమీర్ పెళ్లి చేసుకుంటాడన్న నమ్మకంతో యువతి తన పేరు, సంప్రదాయాలను కూడా మార్చుకుంది. మూడేళ్లుగా తమతో పాటు నివసిస్తుండడంతో స్థానికులంతా కొత్త దంపతులు, కొత్త కాపురం అని అంతా అనుకున్నారు. ఈలోగా సదరు యువతి గర్భవతి అయ్యింది. దీంతో సమీర్‌ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తెచ్చింది. ఇంట్లో ఒప్పించి వస్తానని చెప్పి వెళ్లిన సమీర్ తీరా తన ఇంటికి వెళ్లాక తాను పెళ్లి చేసుకోలేనని చెప్పడంతో ఆమె హతాశురాలయ్యింది.
కడుపులో బిడ్డ పెరుగుతున్న దశలో సమీర్ అలా చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఆమె ఆత్మహత్యా యత్నం చేసింది. సదరు యువతి తల్లి చిన్నప్పుడే చనిపోవడం, తండ్రి మరో పెళ్లి చేసుకుని పట్టించుకోవడం మానేయడంతో ఇన్నాళ్లు తనకు అండా, దండా అన్నీ సమీర్ అని భావించిన యువతి అతను ఇప్పుడు ముఖం చాటేయడంతో ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయినట్లు భావించింది. మనస్తాపంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసిన ఆమెను వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని రక్షించారు. స్థానికులు ఆమెకు అండగా నిలవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.