akhilesh: రేపు కీలక ప్రకటన చేయనున్న అఖిలేష్ యాదవ్, మాయావతి
- ఉత్తరప్రదేశ్ లో కూటమిగా ఏర్పడనున్న ఎస్పీ, బీఎస్పీ
- చిన్న పార్టీలతో కలసి గ్రాండ్ అలయన్స్
- ఒంటరిగానే బరిలోకి దిగనున్న కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ లో తిరిగి పట్టు సాధించేందుకు వైరి పక్షాలైన ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన సంగతి తెలిసిందే. బీజేపీని నిలువరించి పూర్వ వైభవం పొందే క్రమంలో ఏళ్ల నాటి వైరాన్ని రెండు పార్టీలు పక్కన పెట్టేశాయి. ఈ కూటమిపై రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుంది. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు రేపు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పొత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు.
మరోవైపు, గత కొన్ని రోజులుగా అఖిలేష్, మాయావతిలు వరుస సమావేశాలను నిర్వహించారు. ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల పంపకాలు కూడా ఖరారైనట్టు సమాచారం. కూటమిలోకి రాష్ట్రీయ లోక్ దళ్, నిషద్ పార్టీలాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుని పోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ కూటమిలో చోటు దక్కే అవకాశాలు కన్పించడం లేదు. యూపీలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సూచనప్రాయంగా తెలిపింది.
2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 లోక్ సభ స్థానాలకు గాను 73 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్పీ 5 స్థానాలలో గెలుపొందింది. మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు గెలుపొందారు.