Andhra Pradesh: జగన్ దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన కోర్టు!
- లోతుగా విచారణ జరపాలన్న ఎన్ఐఏ అధికారులు
- తమ కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి
- నిన్న విశాఖ జైలు నుంచి అదుపులోకి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. నిన్న రాత్రి శ్రీనివాసరావును విశాఖపట్నం జైలు నుంచి తీసుకొచ్చిన అధికారులు రాత్రంతా విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు. అనంతరం ఈరోజు ఎన్ఐఏ కోర్టు ముందు హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జగన్ పై హత్యాయత్నం కేసులో విచారణ జరిపేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ విషయంలో లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని వివరించారు.
వాదనలు విన్న న్యాయమూర్తి.. శ్రీనివాసరావును ఈ నెల 25 వరకూ జ్యుడీషియల్ రిమాండ్ కు పంపుతూ ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో లోతైన గాయం కావడంతో జగన్ హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.