Andhra Pradesh: చంద్రబాబు చర్యలు తీసుకోకపోతే.. అమరావతిలో ఆందోళనకు దిగుతాం!: సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరిక
- ఏపీ సీఎం కరవును పట్టించుకోవడం లేదు
- హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారు
- నిషేధ భూములను కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో కరవును పట్టించుకోకుండా హెలికాప్టర్లలో తిరుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆయన ఎన్నికలు వచ్చినప్పుడే మేల్కొంటారని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలకు నిషేధ భూములను పట్టాలుగా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు.
కరవుతో అల్లాడుతున్న రైతులను, ప్రజలను ఆదుకునేందుకు చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేదంటే రాజధాని అమరావతిలో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రాఫెల్ యుద్ధవిమానాల కుంభకోణంలో ప్రధాని నరేంద్ర మోదీ నిండా మునిగిపోయారని ఆరోపించారు.
అందుకే సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై వేసిన హైపవర్ కమిటీని తొలగించారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మోదీ త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ చట్టాన్ని తెచ్చారని స్పష్టం చేశారు.