Andhra Pradesh: జగన్ ఇప్పుడు తీర్థయాత్ర చేస్తున్నారు.. త్వరలోనే కాషాయంతో కాశీయాత్ర చేయడం ఖాయం!: బుద్ధా వెంకన్న
- చంద్రబాబును ప్రజలు నమ్మి గెలిపించారు
- సంక్రాంతి కానుకలపై వైసీపీ నిందలు దారుణం
- అమరావతిలో మీడియాతో టీడీపీ నేత
ఏపీ సీఎం చంద్రబాబు హామీలు, సీనియారిటీని నమ్మి రాష్ట్ర ప్రజలు ఆయన్ను ఎన్నికల్లో గెలిపించారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. కష్టపడే తత్వం ఉంది కాబట్టే చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి చంద్రబాబు సంక్రాంతి కానుక ఇస్తే నిందలు వేస్తావా? అని జగన్ ను ప్రశ్నించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఏపీ సీఎం కావాలని జగన్ పగటి కలలు కంటున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు పెన్షన్లను పెంచితే వాటిని కూడా వైసీపీ రాజకీయం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లిన జగన్ తమ అధినేతను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరనీ, ఆయన ప్రధాని మోదీకి తొత్తుగా మారారని దుయ్యబట్టారు. పాదయాత్ర పూర్తి చేసుకున్న జగన్ ఇప్పుడు తీర్థయాత్ర చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఏపీ ప్రజలు ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేస్తారనీ, అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి ఆయన కాశీయాత్ర చేయడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ ముక్కు మూసుకుని కొంగజపం చేసినా సీఎం కాలేరని వెంకన్న స్పష్టం చేశారు. జగన్ ను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న మోదీని కూడా ప్రజలు ఇంటికి పంపుతారన్నారు.