Rohit Sharma: టీమిండియా ఓటమికి కారణాన్ని చెప్పిన విరాట్ కోహ్లీ
- రోహిత్ సెంచరీ, ధోనీ హాఫ్ సెంచరీ
- అయినా ఓడిపోయిన భారత్
- ఆదిలోనే వికెట్లు కోల్పోవడమే కొంప ముంచిందన్న కోహ్లీ
రోహిత్ శర్మ వీరోచితంగా ఆడి 133 పరుగులు, అతనికి అండగా ధోనీ 51 పరుగులు చేసి రాణించినా, మిగతావారంతా కలిసి 100 పరుగులు సాధించడంలో విఫలం కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, బౌలర్లు బాగా రాణించినప్పటికీ, ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోవడం ఓటమికి కారణమైందని అన్నాడు.
సునాయాసంగా 300 పరుగులకు పైగా సాధించగలిగే పిచ్ పై, ప్రత్యర్థిని 288 పరుగులకు పరిమితం చేశామని, అయితే, రోహిత్ శర్మకు మద్దతుగా క్రీజులో ఎవరూ నిలవక పోవడంతో ఓటమి తప్పలేదని అన్నాడు. ధోనీ అవుట్ అవడం ప్రభావాన్ని చూపిందన్నాడు. రోహిత్, ధోనీలు ఉన్నంతసేపూ విజయావకాశాలు కనిపించాయని, అయితే, ఆసీస్ తమ కంటే మెరుగ్గా ఆడి విజయాన్ని సొంతం చేసుకుందని అన్నాడు. ఈ ఓటమితో జట్టు ఎలాంటి ఒత్తిడికి లోను కాబోదని చెప్పాడు.