Hyderabad: పల్లెబాటన నగరం... ఖాళీ అవుతున్న హైదరాబాద్!
- హైదరాబాద్ నుంచి 20 లక్షల మంది పయనం
- కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
- హైదరాబాద్ లో తగ్గిన ట్రాఫిక్ రద్దీ
సంక్రాంతి పర్వదినాల్లో సొంత గ్రామాలకు వెళ్లాలని భావిస్తున్న భాగ్యనగర వాసులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లూ కిటకిటలాడుతున్నాయి. ఇప్పటివరకూ సుమారు 15 లక్షల మంది హైదరాబాద్ ను వీడి స్వగ్రామాలకు చేరుకోగా, నేడు మరో 7 నుంచి 8 లక్షల మంది వరకూ ప్రయాణాలు పెట్టుకున్నారు.
రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో తిరిగే సిటీ బస్సులను సైతం విజయవాడ, గుంటూరు, కరీంనగర్ తదితర ప్రాంతాలకు టీఎస్ ఆర్టీసీ తిప్పుతోంది. ఈ బస్సులతో ఇబ్బందిగా ఉన్నా, మరో మార్గం లేక వెళుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. రద్దీకి అనుగుణంగా ఎన్ని బస్సులనైనా నడిపిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అడ్డగోలుగా దోచేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విశాఖపట్నం, తిరుపతి, కడప తదితర నగరాల నుంచి ప్రజలు స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రూ. 3 వేలకు పైగా టికెట్ చార్జీని తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపించారు. విజయవాడకు సాధారణ రోజుల్లో రూ. 400 వరకూ వసూలు చేసే బస్సులు ఇప్పుడు రూ. 1,500 వరకూ అడుగుతున్నారు. అంత చెల్లించేందుకు సిద్ధపడినా టికెట్ లభించని పరిస్థితి.
దీంతో చాలా కుటుంబాలు కార్లను అద్దెకు తీసుకుని తమ గ్రామాలకు తరలివెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక టోల్ గేట్ల వద్ద వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోతున్నాయి. ఒక్కో టోల్ గేటును దాటాలంటే కనీసం 2 గంటల పాటు వేచిచూడాల్సి వస్తోందని వాహనదారులు మొత్తుకుంటున్నారు. టోల్ టాక్స్ వసూలును రద్దు చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆదేశించినా, నేషనల్ హైవేస్ నుంచి ఆర్డర్ రాలేదని, అందువల్ల టోల్ చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
ఇదిలావుండగా, హైదరాబాద్ నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి వెళ్లడంతో, నిత్యమూ కనిపించే ట్రాఫిక్ జామ్ లు తగ్గాయి. రహదార్లపై వాహనాలు పలుచగా కనిపిస్తున్నాయి.