Krish: నేను వచ్చేశాక కథను మార్చేశారు: 'మణికర్ణిక'పై క్రిష్
- ఏమైనా మాట్లాడితే సినిమా శోభ తగ్గుతుంది
- మార్చేసి చరిత్రను వక్రీకరించారు
- సోనూసూద్ ను తొలగించకుండా ఉండాల్సింది: క్రిష్
కంగనా రనౌత్ ముఖ్య పాత్రలో నిర్మితమైన 'మణికర్ణిక' చిత్రం తనదేనని, తాను ఏమైనా మాట్లాడితే సినిమా శోభ తగ్గుతుందన్న ఉద్దేశంలోనే వివాదాలకు దూరంగా ఉన్నానని దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించారు. ఓ దినపత్రికతో మాట్లాడిన ఆయన, తాను మణికర్ణిక కోసం 109 రోజులు పనిచేసిన తరువాత, 'ఎన్టీఆర్' ఆఫర్ వచ్చిందని, దానికోసం తాను వచ్చి, ఆపై రెండు వారాల్లో 'మణికర్ణిక' మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని భావించానని చెప్పాడు.
కానీ, తాను వచ్చేసిన తరువాత సినిమాలో రకరకాల మార్పులు జరిగాయని, సోనూసూద్ ను తీసేశారని, ఆయనపై తీసిన సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించారని, కథను తప్పుదారి పట్టించి, చరిత్రను వక్రీకరించారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను వివాదాల్లోకి వెళ్లదలచుకోలేదని, ఓ నటుడిగా సోనూసూద్ చేసింది నూటికి నూరు శాతం కరెక్టని, ఆయన్ను తొలగించి పెద్ద తప్పు చేశారని అన్నాడు. సినిమా టీమ్ తో తనకు ఇప్పటికీ మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పాడు. ప్రస్తుతం 'ఎన్టీఆర్-మహానాయకుడు' పనిలో బిజీగా ఉన్నానని, అది కూడా విడుదలైన తరువాత, కొంత విశ్రాంతి తీసుకుని, ఆపై తదుపరి చిత్రంపై దృష్టిని సారిస్తానని క్రిష్ వ్యాఖ్యానించాడు.